ఇందులోభాగంగా తొలుత డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం వేటువేసింది. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వీరికి ఈ నెల ఒకటో తేదీన మెమో జారీ చేసింది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పని చేస్తున్న దాదాపు 350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో మిగితా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2.40 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో లక్షమంది వరుక ఆప్కాస్ విభాగంలోకి తీసుకురాగా, మిగితా 1.40 లక్షల మంది ఏజెన్సీలు, థర్డ్‌పార్టీల ద్వారా సేవలు అందిస్తున్నారు. వీరిలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు సుమారుగా 60 వేల మంది వరకు ఉంటారని అంచనా.
ఈ పరిస్థితుల్లో ఆప్కాస్‌లో చేరిన వారిలో 17మందిపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం మిగిలిన వారిపై కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణ విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని తెలిపారు.