భారత్‌ను భయపెడుతున్న నిసర్గ తుఫాను.. మహారాష్ట్ర - గుజరాత్‌లకు ముప్పు!

సోమవారం, 1 జూన్ 2020 (21:48 IST)
భారత్‌ను ఇపుడు మరో తుఫాను భయపెడుతోంది. ఈ తుఫానుకు నిసర్గ అని నామకరణం చేశారు. ఈ తుఫాను వల్ల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
వాస్తవానికి మొన్న బంగాళాఖాతంలో ఎంఫాన్ తుఫాను ఏర్పడింది. ఇది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అపార ఆస్తి నష్టం సంభవించింది. 
 
ఈ దఫా అరేబియా సముద్రంలో అలజడి రేగింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 
 
దీనికి నిసర్గ అని పేరు పెట్టారు. ఇది భారత పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు. 'నిసర్గ'కు రుతుపవనాలు కూడా తోడైతే కుంభవృష్టి కురవొచ్చన్న ఐఎండీ అంచనా వేస్తోంది. 
 
ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపైనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇది జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేశారు. 
 
దీని ప్రభావంతో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఆ వేగం 125 కిలోమీటర్లకు చేరవచ్చని వివరించారు. జూన్ 3వ తేదీ నుంచి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు