షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు కర్నాటక రాజధాని బెంగుళూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
బెంగుళూరులో భారీ వృక్షాలు నెలకొరిగి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని తుముకూర్ రోడ్, మైసూర్ రోడ్, బళ్లారి రోడ్, మెజెస్టిక్, ఛామరాజపేట్, బసవన్నగుడి, యశ్వంతపుర్, రాజరాజేశ్వరీ నగర్, మహదేవపుర, హెబ్బల్ ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేఆర్ పురా, మహదేవపుర, హోస్కెట్, రాజరాజేశ్వరీ నగర్లో 90-98 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 6 వరకు బెంగళూరుపై షహీన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.