కుండలో నీళ్లు తాగాడని దళిత బాలుడిని కొట్టి చంపిన టీచర్

ఆదివారం, 14 ఆగస్టు 2022 (10:31 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. దళిత బాలుడిని కొట్టి చంపేశాడు. దాహం వేయడంతో కుండలోని నీరు తాగడమే ఆ బాలుడు చేసిన నేరం. ఉపాధ్యాయుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని జాలారో జిల్లాలోని సురానా గ్రామంలో జులై 20న బాలుడిపై దాడి జరిగింది. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు నిన్న ప్రాణాలు విడిచాడు. నిందితుడైన చైల్ సింగ్ (40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నియంత్రణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్టు తెలిపారు. 
 
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాజస్థాన్ విద్యాశాఖ విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా రేపు (ఆగస్టు 15) సురానా గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు