ప్రధాని మోడీ ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ : బీజేపీ ఎంపీ స్వామి ఫైర్

గురువారం, 25 నవంబరు 2021 (12:33 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు. 
 
ఆయన బుధవారం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీసీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో ఆయన బీజేపీని వీడి టీఎంసీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అదేసమయంలో మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, ప్రధాని మోడీని తూర్పారబట్టారు. 
 
ముఖ్యంగా, మమతా బెనర్జీని జయప్రకాష్ నారాయణ్, మోరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ చంద్రశేఖర్, పీవీ నరసింహా రావు వంటి రాజకీయ పరిణితి గలిగిన నేతలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారనీ, చేసేదే చెబుతారంటూ కితాబిచ్చారు. రాజకీయాల్లో ఉన్న నేతల్లో ఇలాంటి గుణాలు కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు. మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, మనం చైనా అణ్వాయుధానికి ఎందుకు భయపడుతున్నాం అంటూ ప్రశ్నించారు. చైనా విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తుందన్నారు. 
 
విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో దేశ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న సమయంలో మోడీ ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ నిలదీశారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు ఇపుడు చైనాను మాత్రం దురాక్రమణ దేశంగా చెప్పడానికి జంకుతున్నారంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు