శశికళపై తొలి తిరుగుబాటును జయ మేనల్లుడు ప్రారంభించినట్లేనా. గురువారం మీడీయాతో దీపక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. జయలలిత వారసులు తానూ తన చెల్లెలు దీపా మాత్రమేనని దీపక్ తేల్చి చెప్పారు. జయ ఇల్లు పోయెస్ గార్డెన్‌పై సర్వహక్కులూ తమ ఇద్దరివేనని ప్రకటించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదు కానీ జయ రాజకీయ వారసురాలిగా దీప మాత్రమే అర్హురాలని పేర్కొన్నారు. పైగా మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు కూడా చేశారు.
తమిళనాట అధికార అన్నాడీఎంకేలో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా దీపక్ గళం విప్పారు. తాను, తన సోదరి దీపా జయకుమార్ మాత్రమే జయలలితకు వారసులమని, పోయెస్ గార్డెన్ ఇంటిపై తామిద్దరికి అన్ని హక్కులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అంత్యక్రియల సమయంలో ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు.
శశికళతో కలసి జయలలిత అంత్యక్రియలు పూర్తిచేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీపక్ మాత్రం శశికళ వెన్నంటే ఉన్నారు. అన్ని విషయాల్లో చిన్నమ్మకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆయన గురువారం ఒక్కసారిగా ఆక్రోశం వెళ్లగక్కారు. శశికళ సోదరి వనిత మణి కుమారుడు టీటీవీ దినకరన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం.
గురువారం ఓ మీడియా సంస్థతో దీపక్ ఫోన్ లో మాట్లాడారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త మరణంపై న్యాయ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ,, సీఎంగా పళనిస్వామి కొనసాగాలి. ఉప ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగించాలి’’ అని దీపక్ అన్నారు.