దేశ రాజధాని హస్తినలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ కారణంగా అనేక మంది నీటిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ పార్లమెంట్ సభ్యులంతా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే, భారీ వర్షాల దెబ్బకు వర్షపు నీరు వారి నివాస గృహాల్లోకి కూడా చేరింది. ఢిల్లీలో నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్ నేత, ఢిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా నీటిలో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు.