గొడవ చిన్నదే.. కానీ మహిళ ప్రాణాలు తీశారు... ఎక్కడ?

శుక్రవారం, 18 జనవరి 2019 (09:15 IST)
మనం నివసించే ప్రాంతాల్లో ఇరుగుపొరుగు ఉంటారు. వీరితో చిన్నపాటి గొడవలు సాధారణమే. అలాంటి చిన్నపాటి గొడవలకే మనిషి ప్రాణాలు ఎవరూ తీయరు. కానీ, ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలో చిన్నపాటి గొడవపై ఓ మహిళ ప్రాణాలు తీశారు పక్కింటివారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆజాద్ (40), వీరూ (41) అనే వారు పక్కపక్క ఇళ్ళలో నివసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వీరూ కుమార్తె ఇంటి బాల్కనీలో నిల్చొనివుండగా ఆమె చేతిలోని బాటిల్ జారి కిందవున్న ఆజాద్ తలపై పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆజాద్ ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరూ భార్య సునీత (35)పై గొడవకు దిగాడు. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగిపోయిందని భావించారు. 
 
కానీ, బుధవారం మళ్లీ ఇదే విషంపై వారిద్దరి మధ్య వాదులాట ప్రారంభమై, చివరకు కొట్లాటకు దారితీసింది. రాత్రి 7.30 గంటల సమయంలో భర్త రాగానే సునీత జరిగిన విషయం చెప్పింది. దీంతో దంపతులిద్దరితో పాటు వారి కొడుకు ఆకాశ్ (18) ఇంటి నుంచి బయటకు వచ్చారు. 
 
అప్పటికే కత్తితో సిద్ధంగా ఉన్న ఆజాద్.. ఆ ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కత్తిపోట్లకు గురైన వీరూ, ఆకాశ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఈ కొట్లాట జరిగే సమయంలో చుట్టుపక్కల వారెవరూ కనీసం ఆజాద్‌ను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఇరుగుపొరుగువారంతా ఆజాద్ వికృత చర్యలను ఓ వేడుకగా చూస్తుండిపోయారు. కొందరు యువత అయితే తమ సెల్‌ఫోన్లలో వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. దాడి తర్వాత ఆజాద్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు