ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్పను తొలిసారి నిషేధిత వయసులోని ఇద్దరు మహిళలు దర్శనం చేసుకున్నారు. ఆ ఇద్దరే కేరళలోని కొచ్చికి చెందిన కనకదుర్గ (39), బిందు (40). సుప్రీంకోర్టు ఎప్పుడో సెప్టెంబరు 28న తీర్పు ఇస్తే మూడు నెలల తర్వాత జనవరి 2న వారు దర్శనం చేసుకోగలిగారు.
దర్శనం అయిన తర్వాత బయట తిరిగితే ఎక్కడ దాడి చేస్తారోనని వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 13 రోజుల తర్వాత మంగళవారం ఉదయం కనకదుర్గ ఇంటికి చేరుకుంది. కానీ వాకిట్లోనే ఆమె అత్త అడ్డుకుంది. ఇంట్లోకి రావడానికి ఒప్పుకోనంది. అయితే కొద్దిసేపటి తర్వాత లోపలికి రానిచ్చింది. కనకదుర్గ ఇంట్లోకి అడుగుపెట్టాక మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
కోపంతో అత్త తిట్లదండకం మొదలుపెట్టింది. పవిత్రమైన అయ్యప్ప ఆలయంలోకి నీ ఇష్టానికి వెళ్తావా అంటూ తలపై కర్రతో కొట్టడంతో ప్రస్తుతం కనక దుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం. అయితే, కనకదుర్గకు రక్షణగా 8 మంది పోలీసులు కూడా వచ్చారు. ఎటువంటి దాడులు జరగకుండా చూసేందుకు ఇంటి బయట కాపలాగా ఉన్నారు. కానీ ఇంటి లోపల దాడి జరగొచ్చని వారు ఊహించలేకపోయారు.