'అమ్మ' గదికి నో ఎంట్రీ.. రెండో అంతస్తు వరకే పర్మిషన్.. బాంబు పేల్చిన మంత్రి

సోమవారం, 9 అక్టోబరు 2017 (09:11 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై అధికార పార్టీకి చెందిన మంత్రులు బాంబులు పేల్చుతున్నారు. జయలలిత చికిత్స పొందేసమయంలో తాము చూడలేదంటూ మంత్రులు ఒక్కొక్కరిగా గొంతు విప్పుతున్న విషయంతెల్సిందే. తాజాగా తమిళనాడు రాష్ట్ర పర్యటకశాఖా మంత్రి వెల్లమండి నటరాజన్ బాంబు పేల్చారు.
 
అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితను తాను కూడా చూడలేదని ఆయన చెప్పారు. 'అమ్మ' ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు చూసేందుకు శశికళ కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించలేదని ఆయన ఆరోపించారు. పైగా, జయలలిత మృతిపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. 
 
జయ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో రెండో అంతస్తు వరకే తాము వెళ్లగలిగామని ఆ తర్వాత ఎవరినీ ‘అమ్మ’ ఉన్న గదిలోకి వెళ్లనివ్వలేదని అన్నారు. దర్యాప్తు కమిషన్ కోరితే తనతో సహా మరింతమంది మంత్రులు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు నటరాజన్ తెలిపారు. కాగా, జయలలితను తాను ఆసుపత్రిలో చూడలేదని ఇదివరకే మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ప్రకటించి కలకలం రేపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు