అత్తను బాధపెట్టినవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు... దినకరన్ డైలాగ్స్

సోమవారం, 28 ఆగస్టు 2017 (15:06 IST)
పళణిస్వామి ప్రభుత్వాన్ని పడదోసేందుకు శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్ చేస్తున్న ప్రయత్నం అంతాఇంతా కాదు. తన మేనత్త భిక్ష పెట్టిన పదవిలో ఉండి తమనే పార్టీ నుంచి బయటకు పంపేసిన పళణిస్వామిని దించేయడం కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా పళణిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని అత్త శశికళ, దినకరన్‌కు చెప్పడంతో ఆవిధంగానే ముందుకు వెళుతున్నాడు దినకరన్.
 
ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసి పళణిస్వామి ప్రభుత్వానికి బెంబేలెత్తించాడు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. పళణిస్వామికి మద్ధతుగా ఉన్న రత్నసభాపతి, కలైసెల్వన్‌లు కూడా నేరుగా దినకరన్ దగ్గరకు వచ్చేశారు. అంతటితో ఆగలేదు దినకరన్. మరో 60 మంది ఎమ్మెల్యేలు.. 8మంది మంత్రులు తమ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారంటూ తన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పారట. 
 
దీనికితోడు సోమవారం ఓపీఎస్-ఈపీఎస్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ముఖ్యమంత్రి పళని స్వామి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం పడిపోతుంది.. పడిపోక తప్పదని దినకర్ అంటున్నారు. మా మేనత్తను బాధపెట్టిన వారు అధికారంలో ఉండకూడదంటూ దినకరన్ ఆవేశంగా ప్రసంగించారట. డీఎంకెతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని అత్త శశికళ కూడా దినకరన్ కు చెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి