నేనెక్కడకు వెళ్తున్నాను... మీ గుండెల్లో లేనూ?

మంగళవారం, 7 ఆగస్టు 2018 (22:45 IST)
నెనెక్కడకు వెళ్తున్నాను... మీ గుండెల్లో లేనూ? ఇవే డీఎంకే అధినేత కరుణానిధి చివరి పలుకులు. వాస్తవానికి ఆయన వందేళ్ళ జీవించడమేకాకుండా తుదిశ్వాస వరకు తమిళ ప్రజలకు సేవ చేయాలని భావించారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.
 
50 యేళ్ళపాటు డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్న కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో తమిళ ప్రజలకు తుది వీడ్కోలు చెబుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. దీంతో ఒక్కసారిగా తమిళ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. కలైజ్ఞర్‌ ఇకలేరనే వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
అయితే, కరుణానిధి గత యేడాదిన్నరకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతకుముందు ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో కార్తకర్తలతో జరిగే సమావేశాల్లో తన మనసులోని కోరికను బయటపెట్టేవారు. 
 
వందేళ్లకు పైబడినా సరే తమిళ ప్రజల సేవకే తన జీవితం అకింతమని పదేపదే చెబుతూ ఉండేవారు. దశాబ్దాలుగా తనను గుండెల్లో పెట్టుకున్న తమిళ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని వ్యాఖ్యానించేవారు. 
 
అంటే నిండునూరేళ్లూ జీవించి తమిళ ప్రజలకు సేవ చేయాలన్నది కరుణానిధి బలమైన కోరికగా ఉండేది. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పరిస్థితి వైద్యుల చేయి దాటిపోయింది. 
 
వయోభారం కృంగదీయడంతో పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన కలైంజ్ఞర్ అలిసిపోయారు. 'నెనెక్కడకు వెళ్తున్నాను... మీ గుండెల్లో లేనూ?' అంటూ ఆయన దీర్ఘనిద్రలోకి జారుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు