డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు త్వరలోనే పట్టాభిషేకం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడిగా, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా క్రియాశీలక పాత్ర పోషించేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు డీఎంకే రంగం సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన డీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది.
పార్టీ అధ్యక్షుడిగా వున్న ఎం.కరుణానిధి వృద్ధాప్యం, అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేది స్టాలిన అయినప్పటికీ సాంకేతికపరంగా కొన్నింటికి కరుణానిధి హాజరు కావాల్సిరావడం, ఆయన పాల్గొనలేకపోతుండడంతో ఆయా కార్యక్రమాలు నిలిచిపోవడం వంటి పరిణామాలు నెలకొంటున్నాయి.
జయ మరణించడంతో అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతికి వెళ్లడం ఖాయమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని క్రియాశీలకంగా నడిపే వ్యక్తి చురుగ్గా వుండడం మేలని డీఎంకే అధిష్టానం భావిస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లూ అన్నాడీఎంకేలో ఎలాంటి పాత్ర పోషించని శశికళకు ప్రత్యర్థిగా కరుణానిధిని వుంచడం సరికాదని సీనియర్లు భావిస్తున్నట్టు తెలిసింది. వీటన్నింటి పరిణామంలో పార్టీ పగ్గాలు స్టాలినకు అప్పగించడమే మేలని కరుణతో సహా సీనియర్లంతా భావిస్తున్నారు.