అన్‌లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది.
మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది.లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వినే ఆప్షన్ ఇచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.
*కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు *
కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న స్కూళ్లనే తెరువాలి. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులు,టీచర్లు, ఉద్యోగులు బడికి రావద్దు. తరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్ చేయించాలి. ఒకవేళ స్కూల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా వాడితే పరిసరాలన్నింటినీ వందశాతం శానిటైజ్ చేయాలి.
పాఠశాలకు రావడం, వర్చువల్ క్లాసులకు వెళ్లడం..వంటివి ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలేయాలి. చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బులు, శానిటైజర్లను విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. స్టాఫ్‌గది, కార్యాలయం,మెస్, గ్రంథాలయం, కేఫటేరియాల్లో భౌతికదూరం పాటించేలా చూడాలి.
విద్యార్థి,టీచర్ మధ్య ఇంటరాక్షన్ కోసం ఆరుబయట,లేదంటే చెట్లకింద ఏర్పాట్లు చేయాలి. తరగతి గది ఉష్ణోగ్రతలు 24 -30 సెల్సియస్ డిగ్రీలుగా, తేమ 40 -70 శాతంగా ఉండాలి. గదుల్లో గాలి ధారాలంగా రావాలి. స్వచ్ఛగాలిని పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. విద్యార్థులు ఉపయోగించే, లాకర్లు,అల్మారాలను రోజుకొకసారి శానిటైజేషన్ చేయాలి. ఈతకొలనులను తెరువద్దు.
యాక్టివిటీస్ సమయంలో..
నోటుపుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, వాటర్‌బాటిళ్లను ఒకరినొకరు మార్చుకోవడాన్ని అనుమతించరాదు. ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని అనుమతించాలి. సెషన్లుగా విభజించి విద్యార్థులను తీసుకెళ్లాలి. ప్రయోగశాలల్లోని పరికరాలను వాడకముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిటైజ్‌చేయాలి. టైమ్‌స్లాట్స్‌గా, విద్యార్థులను బృందాలుగా విభజించి కృత్యాలు నిర్వహించాలి. అనంతరం శానిటైజ్ చేయాలి.