శబరిమల ఎంట్రీ ముఖ్యంకాదు.. లైంగిక వేధింపులను అడ్డుకోండి : తస్లీమా నస్రీన్

ఆదివారం, 18 నవంబరు 2018 (10:11 IST)
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ చురకలు అంటించారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని మహిళా కార్యకర్తలు ఎందుకంత ఆసక్తి చూపున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు ఓ సూచన చేశారు. 
 
ఇదే విషయంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "మీరంతా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలపై పోరాడటానికి దృష్టిపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా కార్యకర్తలు శబరిమలకు బదులు గ్రామాలకు వెళితే బాగుంటుందన్నారు. అక్కడ మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహ హింస, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఘటనలతో ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా నిలవాలని తస్లీమా నస్రీన్ కోరారు. బాలికలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ, సమాన వేతనాలు పొందడానికి అవకాశాలు లేని గ్రామాలకు వెళితే బాగుంటుందని హితవు పలికారు. 
 
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 యేళ్ళ మధ్య వయసు మహిళలు వెళ్లేందుకు సుప్రీంకోర్టు గత సెప్టెంబరు 28వ తేదీన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, పలువురు మహిళలు ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారిలో భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కూడా ఉన్నారు. ఈమె శబరిమలకు వెళ్లేందుకు కోల్‌కతా నుంచి కొచ్చికి వెళ్లగా, ఆమెను అయ్యప్ప భక్తుల ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు