ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి చిక్కుల్లో పడ్డారు. ఆమె సొంత పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలో కేవలం 45 రోజుల్లో ఏకంగా 107 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ మేరకు ఢిల్లీలోని బీఎస్పీ కార్యాలయంలో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా బహిర్గతమైంది. దీంతో ఈ డిపాజిట్లపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఐటీతోబాటు ఈడీ కూడా ఈ డిపాజిట్ల వైనంపై దర్యాప్తు మొదలెట్టింది. మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్‌కు, ఈ బిల్డర్లకు మధ్య లావాదేవీలు జరిగినట్టు సమాచారం. వీరి హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఆనంద్‌కుమార్ పెద్దఎత్తున నల్లధనాన్ని పెట్టుబడి పెట్టాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు.
దీనిపై మాయావతి స్పందించారు. తాను దళితురాలిని కావడం వల్లే బీజేపీ తనను, తమ పార్టీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. నియమ నిబంధనలకు అనుగుణంగానే తమ పార్టీ నిధులను బ్యాంకుల్లో జమ చేసినట్లు స్పష్టం చేశారు. తాను ఆగస్టు 31 నుంచి ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నానని, బీఎస్‌పీ కోసం విరాళాలను సేకరించామని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడటానికి ముందే తాము ఈ సొమ్మును స్వీకరించినట్లు పేర్కొన్నారు. బీజేపీ మనస్తత్వం దళిత వ్యతిరేకమని ఆరోపించారు. తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. అందుకే తనను, తన పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.