అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గంలో టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం కూవత్తూరు రిసార్టుల్లో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఒక్కసారి అక్కడ నుంచి బయటపడితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న టెన్షన్‌లో శశివర్గం నేతలు ఉన్నారు. అదేసమయంలో రిసార్టు బిల్లు రోజురోజుకూ తడిసి మోపెడవుతోంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బిల్లు జెట్ స్పీడ్ వేగంతో పెరిగిపోతోంది. వీటన్నింటికీ ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు వీలుగా బలపరీక్షకు ఎక్కువ రోజులు ఆగకుండా తక్షణమే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం శనివారం సరైన ముహుర్తమని భావించి, అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నారు.
గత కొన్ని రోజులుగా తమిళనాట చోటుచేసుకున్న డ్రామాకు గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయంతో తెరపడింది. ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎవరన్నది గవర్నర్ తేల్చేశారు. రాజ్‌భవన్‌లో సీఎంగా కె.పళనిస్వామి ప్రమాణం చేయించారు. ఇదంతా అటుంచితే సీఎంగా ప్రమాణం చేసిన పళని స్వామి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష పాస్ కావాల్సి ఉంది. సీఎంగా ప్రమాణం చేసినా ఆయన టెన్షన్ టెన్షన్‌గానే గడపనున్నారు. శనివారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ బలనిరూపణలో ఎవరు నెగ్గితే వారికే సీఎం పీఠం దక్కనుంది.
నిజానికి బలనిరూపణకై గవర్నర్ విద్యాసాగర్ రావు 15 రోజులు గడువిచ్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గడువు చాలా ఎక్కువ. ఈ గ్యాప్‌లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పళనిస్వామికి కత్తిమీదసాము వంటిదే. ఎందుకంటే ఈలోపు పన్నీర్ సెల్వం వైపు ఎమ్మెల్యేలు జంప్ కాకుండా చూసుకోవాలి. మరోవైపు పన్నీర్ సెల్వం శిబిరంలోని శాసన సభ్యులను తమవైపు లాక్కునేందుకు శశివర్గం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తన టీంలో ఇప్పటికే ఉన్నవారితో పాటు మరో పదిమందిని తీసుకురాగలిగితే పన్నీర్ సెల్వంకు మద్దతిస్తామని డీఎంకే పార్టీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూసినా అటూ ఇటూ 10మంది ఎమ్మెల్యేలు కీలకంగా మారనున్నారు. అందుకే వీలైనంత త్వరలో ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని నిర్ణయించి శనివారమే బలపరీక్షకు మొగ్గు చూపారు. మొత్తానికి చూస్తే శనివారం ఎవరైతే మద్దతు ఎక్కువ చూపితే వారికే సీఎం పీఠం శాశ్వతంగా దక్కనుంది. ఓ వైపు పళనిస్వామి, మరోవైపు పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఎత్తకు పైఎత్తులు వేసి ఎమ్మెల్యేలను లాక్కునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం.