హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫామ్ పైకి ఏనుగు

గురువారం, 25 మార్చి 2021 (14:08 IST)
అటవీ ప్రాణులు ప్రస్తుతం జనవాసానికి వచ్చేస్తున్నాయి. ఇటీవల చిరుతలు, పాములు జన ప్రాంతాలకు చేరుకుంటూ దాడి చేసిన ఘటనలు వింటూనే వున్నాం. తాజాగా అడవిలో ఉండాల్సిన ఏనుగు ఒకటి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం పైకి రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. 
 
రైలు కోసం ఎదురుచూస్తున్న వారు బతుకుజీవుడా.. అంటూ తలో దిక్కు పారిపోయారు. ఈ ఘటన హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌ నుంచి ఈ ఏనుగు హరిద్వార్‌ వైపు వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
హరిద్వార్‌ రైల్వే స్టేషన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైళు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు తొండాన్ని ఆడించుకుంటూ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అడవిలో ఉండాల్సిన ఏనుగు కాస్తా ప్లాట్‌ఫాంపై కనిపించడంతో ప్రయాణీకులు కంగుతిన్నారు. రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ఏనుగును గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది.. బిల్వకేశ్వర్‌లోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
దాంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సాయంతో ఏనుగును సమీపంలోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌లోకి పంపించారు. దాంతో రైల్వే సిబ్బంది సహా ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు