ఓటీటీల పుణ్యమాని సినిమాలకు ఆదరణ నానాటికీ తగ్గిపోతోంది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన చిత్రాలలో "త్రిభాణధారి బార్బరిక్"కు ఎదురైన నిరాశ, యువ దర్శకుడు మోహన్ శ్రీవత్సను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. సినిమా పట్ల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు రాకపోవడం ఆయనను కలచివేసింది.
ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భావోద్వేగ వీడియో వైరల్ గా మారింది. 'ఎంతో కష్టపడి మంచి సినిమా తీసినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకులు రావడం లేదు. శనివారం నా భార్యతో కలిసి సినిమాకు వెళ్లాను. కానీ లోపల కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. మనసు ఎంతో బాధపడింది. అరగంటలోనే థియేటర్ వదిలి బయటకు వచ్చాం. భార్య భయపడి నన్ను ఒంటరిగా పంపకుండా తోడుగా వచ్చింది' అని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'మలయాళం సినిమాలు వస్తే, మంచి కంటెంట్‌కు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మన సినిమాలకు ఎందుకు ఆదరణ లేదో అర్థం కావడం లేదు. ఇకపై మలయాళంలో సినిమాలు తీసి అక్కడే విజయం సాధిస్తాను. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాను కదా... అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను' అంటూ ఆయన భావోద్వేగంగా వీడియో పోస్ట్ చేశారు.
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన త్రిభాణధారి 'బార్బరిక్' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుండి తక్కువ స్పందన రావడంతో దర్శకుడు నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని విశ్లేషకులు మాత్రం దీనికి గల కారణాన్ని స్పష్టంగా చెబుతున్నారు. స్టార్ హీరోలు లేకపోతే థియేటర్లకు రావడం లేదని, చిన్న సినిమాలంటే ఓటీటీలో చూసుకోవచ్చనే ధోరణిలో ప్రేక్షకులు ఉంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.