డిసెంబరుకు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు : కేంద్రమంత్రి గజేంద్ర సింగ్

సోమవారం, 24 మే 2021 (14:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, కరోనా రోగులు చనిపోకుండా ఉండేందుకు వీలుగా ఈ యేడాది ఆఖరు నాటికి దేశ ప్రజలందరికీ టీకాలు వేయనున్నట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోందన్నారు. ఇంకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత వేగంగా చేపట్టేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 
 
కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్‌ వేగంగా కృషి చేస్తోందన్నారు. టీకాల ఉత్పత్తి, లభ్యతను పెంచేందుకు నిరంతరం కేంద్రం కృషి చేస్తుందని, ప్రతి భారతీయుడికి డిసెంబర్‌ నాటికి టీకాలు వేస్తారని తెలిపారు. అప్పుడు ఇది ఒక భారీ రికార్డవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అనుగుణంగా వేగంగా కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిందన్నారు.
 
అయితే.. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల నాణ్యత, ప్రామాణికత, సమర్థతను ప్రశ్నిస్తూ టీకా డ్రైవ్‌ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రారంభం నాటి నుంచి కృషి చేశాయంటూ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపించారు. 
 
ఇప్పుడు ఆయా పార్టీలకు చెందని వ్యక్తులే టీకా కోసం క్యూ కడుతున్నారన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే ఆంఫోటెరిసిన్‌ మందుల ఉత్పత్తి భారీగా చేపడుతున్నట్లు వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేయడంతోపాటు.. విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు గజేంద్ర సింగ్ షెకావత్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు