కరోనా సెకండ్ వేవ్.. జనాల వెన్నులో వణుకు.. ఇకనైనా చర్యలు తీసుకోండి..

శనివారం, 3 ఏప్రియల్ 2021 (08:32 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కరోనా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కేంద్రం పేర్కొంది.

కొవిడ్‌తో 90శాతం కేసులు, మరణాలు ఆయా రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది గతేడాది కంటే మరింత ఉధృతంగా విస్తరిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది.
 
అయితే.. కరోనా వ్యాప్తి తీవ్ర ఆందోళనకర స్థితిలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాల్లో వైరస్ కట్టడి విషయంలో పురోగతి కొరవడిందని.. ఇకనైన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.

ప్రస్తుతం అధిక శాతం కేసులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, పట్టణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని.. ఇక్కడి నుంచి వైరస్ గ్రామీణ ప్రాంతాలకు పాకితే ప్రజారోగ్య వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
 
ఇప్పటికే మహారాష్ట్ర కొవిడ్ గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడితోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43వేల 183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
 
బాధితులు, మరణాలు పెరగకుండా తక్షణమే కఠిన కార్యాచరణకు సిద్ధం కావాలని అక్కడి ప్రభుత్వానికి సూచింది. అంతేకాదు.. మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. అయితే.. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ప్రకటన చేయడం లేదన్నారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం ఆరు గంటలకు మూసేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ఏప్రిల్ రెండో వారానికి కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 15 నుంచి 20 నాటికి కేసులు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు