ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులు రగిలిపోతున్నారు. దేశ రాజధానికి సరిహద్దుల్లో తిష్టవేసి ఆందోళన చేస్తున్నారు. వీరితో కేంద్ర మంత్రులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇందులోభాగంగా సోమవారం ఒక రోజు నిరాహారదీక్ష కూడా చేశారు. అలాగే, ఈ నెల 19వ తేదీ వరకు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సాగు చట్టాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు
రైతులకు వ్యతిరేకంగా తాము ఎలాంటి చట్టాలు చేయలేదని, అలాంటి తప్పులు ఎన్నడూ చేయబోమన్నారు. నూతన చట్టాలతో అన్నదాతలు తమ పంటలను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చని వివరించారు. ఇదే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు తమ సర్కారు ప్రయత్నాలు జరుపుతోందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.