చేపల్ని మార్కెట్లో అమ్మేసి.. ఇంటికి తిరిగి వస్తుండగా రోజూ తనను చూసి మొరిగే కుక్కలను ఓ చేపల వ్యాపారి విషం పెట్టి చంపేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 శునకాలకు ఆ చేపల వ్యాపారి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూరులో చోటుచేసుకుంది. రోజూ రాత్రిపూట ఇంటికి తిరిగి వస్తుండగా శునకాలు తనను చూసి మొరిగేవని.. వాటి బాధ తట్టుకోలేక విషం పెట్టి చంపేసినట్లు ఆ వ్యాపారి పోలీసులకు విచారణలో వెల్లడించాడు.
వివరాల్లోకి వెళితే.. తిరుప్పూర్, కొంకణగిరి ప్రాంతంలో గత కొన్నేళ్ల పాటు చేపల వ్యాపారం చేస్తూ వచ్చాడు గోపాల్. చేపల వ్యాపారం పూర్తి చేసుకుని రోజూ ఇంటికి తిరుగుముఖం పట్టేవాడు. కానీ దారిలో చేపల వాసన చూసిన శునకాలు.. గోపాల్‌ను చూసి మొరిగేవి. ఇంకా కొన్నిసార్లు కరవడం కూడా చేశాయి. రోజూ ఇదే తంతు కొనసాగింది. దీంతో ఆగ్రహానికి గురైన గోపాల్ ఓ రాత్రి వస్తూ వస్తూ చిల్లీ చికెన్‌లో విషం కలిపి ఆ కుక్కలకు పెట్టేశాడు.
గోపాల్ శునకాలకు చిల్లీ చికెన్ ఇచ్చిన దృశ్యాలు, చిల్లీ చికెన్ తిన్నాక శునకాలు విలవిల్లాడిపోయి ప్రాణాలు కోల్పోవడం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మరుసటి రోజు గుంపుగా శునకాలు చనిపోవడాన్ని గమనించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో శునకాలు విషం ఇవ్వడం ద్వారానే చనిపోయాయని కనిపెట్టారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంతో గోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.