జర్మనీ నుంచి థాయ్‌లాండ్ వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన నంబరు ఎల్.హెచ్.772 విమానంలో జర్మనీలోని మ్యూనిచ్ నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంగ్ వెళుతుంది.
అయితే, ఈ విమానం గాల్లో ఉండగా భార్యాభర్తలు గొడవకు దిగారు. ఈ దంపతులిద్దరూ ఘర్షణపడ్డారు. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో వారికి సర్ది చెప్పేందుకు విమాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేది లేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించారు.
అప్పటివరకు పాకిస్థాన్ గగనతలంపైనే విమానం ప్రయాణిస్తుంది. దీంతో పాకిస్థాన్‌లో ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరగా, పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అనుమతి నిరాకరించింది. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీలో అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా, విమానంలో కీచులాడుకున్న దంపతులను వారికి అప్పగించారు.