తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన కావేరీ సమస్యపై రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు వారి వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సమాజంలో పేరున్న వ్యక్తులంతా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనలు, హింసాయుత వాతావరణానికి తెరదించాలని నిరసనకారులకు సూచనలు చేస్తున్నారు.
కానీ కావేరి జలాల వ్యవహారం మాత్రం సద్దుమణిగేలా లేదు. కర్ణాటకలో తమిళులపై దాడి.. తమిళనాడులో కర్ణాటక ఆందోళనలకు నిరసనగా ధర్నాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే శుక్రవారం (సెప్టెంబర్ 16) చెన్నైలో బంద్ నిర్వహిస్తుండగా, కర్ణాటక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ఆగే టర్మినల్ కోయంబేడులో నిరాహార దీక్షకు కూర్చునేందుకు కెప్టెన్ విజయ్ కాంత్ సన్నద్ధమవుతున్నారు.
కావేరి వివాదంపై బక్రీద్ సందర్భంగా సేలం జిల్లా అట్టూరులో డీఎండీకే చీఫ్ విజయ్ కాంత్ మాట్లాడారు. కర్ణాటక-తమిళనాడు ప్రజలు ఇలా ఆందోళన బాట పట్టడం సరికాదన్నారు. సోదరులైన వారితో గొడవకు దిగడం తనకు అర్థం కాలేదన్నారు. ఇలా మనలో మనం తన్నుకుంటుంటే విదేశాలు మనపై దండెత్తి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా డీఎంకే, అన్నాడీఎంకేల వల్లే కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల సమస్య పరిష్కారం కాలేదన్నారు.
ఈ వివాదం రాజుకోవడానికి కారణం ఆ రెండు పార్టీలేనని దుయ్యబట్టారు. వందేళ్లపాటు కావేరి జల వివాదం పరిష్కారం కాకపోయేందుకు ప్రధాన కారణం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలేనని విజయ్ కాంత్ విమర్శించారు. పనిలో పనిగా తమిళనాడు- శ్రీలంకల మధ్య నెలకొన్న జాలర్ల వివాదం కూడా పరిష్కారం కాలేదని ఎత్తిచూపారు.
ఇకపోతే.. కర్ణాటకలో తమిళ ప్రజలపై, వారి ఆస్తులు, వాహనాలపై జరుగుతున్న దాడులకి నిరసనగా ఈ నెల 16నుంచి చెన్నైలోని కోయంబేడు వద్ద గల తమ పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.