వైద్యుడి వృత్తికి కళంకం తెచ్చేలా నడుచుకున్నాడు ఓ డాక్టర్. పూటుగా తాగి డెలివరీ చేశాడు. కానీ తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పురిటినొప్పలతో బాధపడుతున్న కమినిబెన్ (22)ను బోటాడ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోనావాలా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం రాత్రి డాక్టర్ పీజే లఖానీ ఆమెకు డెలివరీ చేశారు.
వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా డెలివరీ అయిన కాసేపటికే శిశువు మృతి చెందగా, కాసేపటికే తల్లికూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి రక్తనమూనాలను పరీక్షించారు. డెలివరీ చేసేటప్పుడు ఆ వైద్యుడు ఫూటుగా తాగాడని తేలింది.