కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. కాళ్ళకు పనిచెప్పిన రాహుల్ - ప్రియాంక

గురువారం, 1 అక్టోబరు 2020 (15:19 IST)
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కాళ్ళకు పని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో ఓ దళిత బాలికను నలుగురు కామాంధులు అత్యాచారం చేసి, ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు నాలుకను తెగ్గోశారు. ఈ కామాంధులు దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ యువతి ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 
 
ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలు గురువారం హత్రాస్‌కు బయలుదేరారు. అయితే, వారి కాన్వాయ్‌ను యూపీ పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ హైవే దగ్గర అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే నడక ప్రారంభించారు. 
 
రాహుల్, ప్రియాంకను అనుసరిస్తూ కార్యకర్తలు కూడా నడక ప్రారంభించారు. దీంతో స్థానికంగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక ఉదయం 10 జన్‌పథ్ నుంచి బయల్దేరారు. హత్రాస్‌కు సరిగ్గా 142 కిలోమీటర్ల దూరంలో డీఎన్‌డీ ఫ్లైఓవర్ వద్ద రాహుల్, ప్రియాంక కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 
 
మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కలెక్టర్ పీకే లక్షకర్ ప్రకటించారు. 'జిల్లాలో సెక్షన్ 144 విధించాం. ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుంది' అని ఆయన గురువారం ఆదేశాలు జారీచేశారు. అలాగే, హత్రాస్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు