గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్య బాగోగులను చూసుకునేందుకు భర్త తన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంధ పదవీ విరమణ (వీఆర్ఎస్) ప్రకటించారు. దీంతో ఆయన పని చేసిన విభాగానికి చెందిన ఉద్యోగులంతా కలిసి సదరు ఉద్యోగికి ఫేర్‌వెల్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భార్య కూడా హాజరయ్యారు. ఈ ఫేర్‌వేర్ పార్టీ జరుగుతుండగానే మరోమారు అనారోగ్యానికి గురైన ఆ మహిళ.. భర్త కళ్లముందే టేబుల్‌పై తలవాల్సి తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దేవేంద్ర సందాల్. కోటాలోని డకానియా ప్రాంతంలో సెంట్రల్ వేర్ హౌస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య దీపిక (50) కొన్ని సంవత్సరాలుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతోంది. పిల్లలు లేకపోవడంతో ఆమె బాగోగులను దగ్గరుండి చూసుకునేందుకు ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. దీంతో ఆయనకు తోటి ఉద్యోగులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. దీపిక, దేవేంద్ర ఇద్దరూ దండలు ధరించి నిల్చున్నారు. చుట్టూ ఉన్న సహోద్యోగులు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీపిక కొంత అసౌకర్యానికి గురై కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత భారంగా ఊపిరి తీసుకోవడం కనిపించింది. గమనించిన భర్త ఆమె వెన్ను నిమరడంతో ఆమె నవ్వడం కనిపించింది. అది చూసిన కొందరు 'ఆమెకు మైకం కమ్మేలా ఉంది. నీళ్లు తీసుకురండి' అని అనడం వినిపించింది.
ఆ వెంటనే ఆమె కుప్పకూలి ముందున్న టేబుల్‌పై తలవాల్చేసింది. అది చూసిన భర్త ఆమె పరిశీలిస్తూ నీళ్లు తీసుకురండి అని కోరాడు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. దేవేంద్రకు మరో మూడేళ్లు సర్వీసు ఉండగానే భార్యను చూసుకునే ఉద్దేశంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన విజ్ఞప్తికి అనుమతి రావడంతో కార్యాలయంలో చివరి రోజున సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఎవరి కోసమైతే వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడో.. ఆమె తన కళ్లముందే మరణించడంతో దేవేంద్ర కన్నీటి పర్యంతమయ్యారు.