ఆగస్టు వరకు వర్షాలే వర్షాలు... పలు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్

శుక్రవారం, 30 జులై 2021 (08:27 IST)
దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాజస్థాన్‌లోని నాగౌర్, సికర్, అజ్మేర్ జిల్లాలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
 
ప్రధానంగా రాజస్థాన్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, జమ్మూకాశ్మీరులో శుక్రవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లా హోంజార్‌లో భారీ వర్షాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు