కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ నిషేధం ఎత్తివేత!!!

శనివారం, 23 డిశెంబరు 2023 (14:37 IST)
కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. అంటే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. పైగా, మహిళలు తమకు నచ్చిన దుస్తులను వేసుకోవచ్చని పేర్కొంది. నిజానికి హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు.? వారు ఏం భుజిస్తారు? అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందువల్ల గతంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఎత్తివేసింది. 
 
కాగా, గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధన ఇస్లాంలో లేదంటూ కర్నటక హైకోర్టు హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించింది. విద్యా సంస్థల్లో అందరికీ ఒకేరకమైన వస్త్ర ధారణ ఉండాలని పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లు కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు