ఫ్రీగా వాడుకుంటున్నారనీ... జాయిన్ హిజ్బుల్ ముజాహిదీన్ అని సెట్ చేశారు...

శుక్రవారం, 1 మార్చి 2019 (10:50 IST)
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇంటికి ఉన్న వైఫై కనెక్షన్‌ను చుట్టుపక్కల వారు కూడా ఉచితంగా వాడుకుంటున్నారు. దీన్ని గమనించిన సదరు వ్యక్తి.. దానికి అడ్డుకట్ట వేయాలని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా... తన ఇంటర్నెట్ వైఫై యూజర్ నేమ్‌ను మార్చేశాడు. ఆ యూజర్ నేమ్ ఏంటంటే... జాయిన్ హిజ్బుల్ ముజాహిదీన్. ఈ పేరు చూసిన ఇరుగు పొరుగువారు.. ఆ వైఫై జోలికెళ్లడం మానేశారు. అయితే, ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు... ఆ కనెక్షన్ గుల్షన్ తివారీ అనే 60 ఏళ్ల వ్యక్తిదని గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఇంటికెళ్లి ఆరా తీశారు. అయితే, ఆ యూజర్ నేమ్‌ను తాను సెట్ చేయలేదనీ, తన చిన్న కుమార్తె సెట్ చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో ఆమె అసలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తమ వై-ఫై కనెక్షన్‌ను కొన్నాళ్లుగా చుట్టుపక్కల వారు ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారని, ఈజీగా కనెక్ట్ అవుతున్నారని వాపోయింది. వాళ్లు తన వై-ఫై జోలికి రాకుండా ఉండేందుకే యూజర్ నేమ్ ఏదైనా భయం పుట్టించేదిగా ఉండాలని భావించి 'జాయిన్ హిజ్బుల్ ముజాహిదీన్' అని సెట్ చేసినట్టు వివరించింది. దీంతో పోలీసులు చేసేదేం లేక కేసు నమోదు చేయకుండా వెళ్లిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు