దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

ఠాగూర్

శుక్రవారం, 27 డిశెంబరు 2024 (12:40 IST)
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగానేకాకుండా, దేశ ఆర్థిక మంత్రిగా కూడా తనదైనముద్ర వేశారు. ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో ప్రవేశపెట్టిన 1991-92 బడ్జెట్ దేశ గతిని మార్చింది. అప్పటివరకూ దశాబ్దాల తరబడి 3.5 శాతంగా కొనసాగుతున్న వృద్ధి రేటును పరుగులు పెట్టించడానికి దోహదపడింది. భారతదేశ కొత్త ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయింది. 
 
'సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమి మీద ఏ శక్తి ఆపలేదు' అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాటలను ఆనాటి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ ప్రస్తావించారు. భారత్ ప్రపంచ శక్తిగా, ఆర్థిక శక్తిగా మారడానికి సమయం ఆసన్నమైందని, దీన్నెవరూ ఆపలేరని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. 
 
1991 జూలై 24న మన్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసింది. ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో కంపెనీలకు పర్మిట్ రాజ్ నుంచి విముక్తి లభించింది. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సులను సడలించడం. లక్ష్యంగా ఆనాటి బడ్జెట్‌లో మన్మోహన్ పలు మార్పులు ప్రకటించారు. ఎగుమతి దిగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. 
 
1991 బడ్జెట్‌ను కేవలం నెల రోజుల్లోనే మన్మోహన్ సింగ్ సిద్ధం చేయడం విశేషం. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆర్థిక సంస్కరణల ఫలాలు కనిపించడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి. లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కోట్లాది మంది ప్రజలు మొదటి సారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణించే ఈ బడ్జెట్ ఘనత మన్మోహన్‌తో పాటు నాటి ప్రధాని పి.వి.నరసింహారావుకు దక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు