నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్

బుధవారం, 2 మే 2018 (21:17 IST)
వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్  కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలాలో నిర్వహించిన కార్యక్రమంలో బిప్లబ్‌ మాట్లాడుతూ.. ‘ఎవ్వరూ నా ప్రభుత్వంపై చెయ్యి వేయలేరు. ఎందుకంటే  ప్రభుత్వం నాది కాదు. ప్రజలది. 
 
నా ప్రజలు, ప్రభుత్వంపై చెయ్యి ఎత్తే ధైర్యం చేస్తే గోళ్లు కత్తిరించేస్తా’ అని వ్యాఖ్యానించారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్ద సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చేవారంతా అది బాగానే ఉందా? లేదా? అని పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారు. అలా చాలామంది చేయడం వల్ల సొరకాయపై గాట్లు పడి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇక దాన్ని ఎవ్వరూ కొనుక్కోరు. సొరకాయ మాదిరిగా నా ప్రభుత్వంపై ఎవ్వరైనా గాట్లు పెడదామని చూస్తే... చూస్తూ ఊరుకోను. వాళ్ల  గోళ్లు కత్తిరించేస్తాను’ అంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు