దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగడించిన బాంబే ఐఐటీకి పూర్వవిద్యార్థి ఒకరు భారీ విరాళాన్ని ఇచ్చారు. ఈ విద్యార్థి రూ.160 కోట్లకు చెక్ రాసి పంపించాడని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి వెల్లడించారు. అయితే, తన పేరు వెల్లడించవద్దని దాత కోరడంతో వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు.
కాగా, ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి కూడా ప్రచారం కోరుకోకపోవడం దాతకున్న గొప్ప మనసును చాటుతోందని ప్రశంసించారు. బహుశా యూనివర్సిటీ అందుకున్న డొనేషన్లలో ప్రచారం కోరుకోని వ్యక్తి ఈ దాత మాత్రమే కావొచ్చని చెప్పారు.
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కూడా ఇటీవల ఐఐటీ బాంబేకు రూ.315 కోట్ల విరాళం అందించారు. నందన్ నీలేకని 1973లో ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని అందించారు.