పంద్రాగస్టుకు అతిథులుగా 1800 మంది సామాన్యులు

సోమవారం, 14 ఆగస్టు 2023 (13:19 IST)
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పంద్రాగస్టు పండుగకు 1800 మంది సామాన్యులను అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో వివిధ వృత్తుల వారు ఉన్నారు. ముఖ్యంగా, ఈ ఆహ్వానితుల జాబితాలో 400 మంది సర్పంచులు ఉన్నారు. అలాగే, కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలకు కూడా ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. 
 
మొత్తం 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. రైతు ఉత్పత్తిదారులు సంస్థల పథకంలో భాగమైన వారిలో 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 50 మంది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో మరో 50 మందికి ఆహ్వానం లభించింది.
 
అంతేకాకుండా, కొత్త పార్లమెంట్ భవనంతో సహా సెంట్రల్ విస్తా ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చొప్పున ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అలాగే, 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యుకారులు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు