ఇకపై ప్రధానిగా నరేంద్ర మోడీ ఆటలు సాగవు : శశిథరూర్

వరుణ్

శుక్రవారం, 7 జూన్ 2024 (10:04 IST)
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన ఆటలు సాగవని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. ఎన్డీయే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లభించిందని గుర్తుచేశారు. వారి హక్కును కాలరాసేందుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. 
 
'ఎన్నికలకు ముందే ఏర్పడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో కావాల్సిన సంఖ్యాబలం లభించింది. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారి హక్కును కాదనే ప్రశ్నే లేదు. తాజా పరిస్థితుల నుంచి నాటకీయ పరిణామాలను సృష్టించడంలో అర్థం లేదని ఇండియా కూటమి చాలా స్పష్టంగా నిర్ణయించింది. వారిని (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి. మేం (ఇండియా కూటమి) బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఉంటాం' అని థరూర్‌ స్పష్టం చేశారు.
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు సాధించగా.. 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకి 293 సీట్లతో మెజార్టీ ఉండగా, విపక్ష కూటమి 234 వద్ద ఆగిపోయింది. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలపై ఇండియా కూటమి దృష్టిసారించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో థరూర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని నిర్ణయించామని తెలిపారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ధీమా ఇవ్వటంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్డీయే కూటమి సన్నాహాలు చేస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు