కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. భారత్, చైనా దేశాల మధ్య ఓ అంగీకారం కుదిరింది. ఫలితంగా ఈ యాత్రను మళ్లీ ప్రారంభిస్తున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో గత 2020లో ఈ యాత్రను నిలిపివేశారు. ఇపుడు కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాలు అంగీకరించాయి.
అలాగే, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి. విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ బీజింగ్ లో పర్యటించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య అక్టోబరులో రష్యాలోని కజాన్‌లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తాజాగా ఇరు పక్షాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమీక్షించాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించేందుకు, పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.
టిబెట్‌లోని కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సును సందర్శించే కైలాస, మానస సరోవర యాత్ర 2020లో నిలిచిపోయింది. కరోనా తగ్గినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిని పునరుద్ధరించేందుకు చైనా వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.
తాజాగా, ఇప్పుడు ఈ యాత్రను పునరుద్ధరించడంతోపాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడంతో, అందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించేందుకు సంబంధిత అధికారులు త్వరలోనే సమావేశమవుతారు.