భారతీయ తొలి ఆస్కార్ విజేత, ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) గురువారం ఉదయం కన్నుమూశారు. అథియాకు ఎనిమిదేళ్ల క్రితం మెదడులో కణితికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత ఆమెకు శరీరంలోని ఓ భాగం పక్షవాతానికి గురవ్వడంతో గత మూడేళ్లుగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. గురువారం ముంబయిలో అథియా కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను దక్షిణ ముంబయిలోని చందన్‌వాడీ స్మశానవాటికలో నిర్వహించారు.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా అథియాను వరించిన ఎన్నో అవార్డులు..
మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో అథియా జన్మించారు. 1956 లో సూపర్‌హిట హిందీ చిత్రం ' సి.ఐ.డి ' తో కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎదిగారు. 1983 లో లెజెండరీ చిత్రం ' గాంధీ ' కి వస్త్రాల రూపకల్పనలో చేసిన కృషికిగాను అథియాను ఆస్కార్ పురస్కారం వరించింది.
1990 లో లెకిన్, 2001 లో లగాన్ చిత్రాలకుగాను ఆమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 2012 లో అథియా తన ఆస్కార్ అవార్డును అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు తిరిగి ఇచ్చేశారు.