అమెరికాలో భారతీయులు ఉద్యోగాలు కొల్లగొట్టడం లేదని, ఉన్నత అమెరికా, ఉన్నత భారత్ కోసం వారు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అమెరికా పాలనాయంత్రాంగం ఈ సత్యాన్ని గ్రహిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం అమెరికాతో సహా 80 దేశాల్లో 200 నగరాల్లో భారతీయ ఐటీ కంపెనీలు ఉన్నాయని, ప్రత్యేకించి గత అయిదేళ్లలో అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 20 బిలియన్ డాలర్ల పన్నును ప్రభుత్వానికి చెల్లించారని మంత్రి గుర్తు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో 4 లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చాయని, ఫార్చ్యూన్ 500లో 75 శాతం కంపెనీలకు మన ఐటీ కంపెనీలు విలువ ఆధారిత సేవలను అందించాయని, అమెరికాకు భారతీయ ఐటీ కంపెనీలు సంపదే తప్ప మరొకటి కాదని మంత్రి చెప్పారు.