భారత సైన్యంలో రెండో అత్యున్నత పురస్కారం మహావీర్ చక్ర గ్రహీత, కమొడోర్ కేపీ గోపాల్‌రావు(94) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నౌకాదళ ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
చెన్నై, బసంత్‌నగర్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గోపాల్‌రావు 1926 నవంబరు 13న తమిళనాడు మదురైలో జన్మించారు. 1950 ఏప్రిల్ 21న భారత నౌకాదళంలో చేరారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం దక్కింది. యుద్ధ సమయంలో డిసెంబరు 4న ఐఎన్‌ఎస్ కిల్తాన్‌కు ఆయన్ను కమాండింగ్ అధికారిగా నియమించారు.
తన బృందంతో పాక్ జలాల్లోకి చేరుకొన్న గోపాల్‌రావు.. కరాచీ పోర్టుపై బాంబులతో దాడి చేశారు. హార్బర్‌లో ఉన్న ఆయిల్, ఇతర పరికరాలను నాశనం చేశారు. అప్పటి విజయానికి గుర్తుగానే ప్రస్తుతం డిసెంబరు 4న నేవీ డే నిర్వహిస్తున్నారు.