విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుంది : నరేంద్ర మోడీ!!

వరుణ్

శుక్రవారం, 21 జూన్ 2024 (10:42 IST)
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్ డాల్ సరస్సు సమీపాన నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు.
 
ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోడీ గుర్తు చేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ.. యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని ఆయన గుర్తుచేశారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందన్నారు. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో కాశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్‌ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లుచాశారు. కానీ, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కాశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు. ఫలితంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.
 
యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగానూ ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్‌, బీఎల్‌ వర్మ, కిషన్‌ రెడ్డి, ప్రహ్లాద్‌ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అవగాహన కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు