ఉన్నతవిద్యలో వైవిధ్యత గల కోర్సులను ప్రవేశపెట్టాలి: ఉపరాష్ట్రపతి

గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:39 IST)
ఉన్నతవిద్యలో వీలైనన్ని వైవిధ్యమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ యువత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి శక్తియుక్తులను దేశాభివృద్ధికోసం సద్వినియోగం చేసుకునేలా ఈ కోర్సులకు రూపకల్పన జరగాలని ఆయన సూచించారు.

విజ్ఞాన సముపార్జనతోపాటు విస్తృతమైన ఉపాధి అవకాశాల కోసం ఈ మార్పులు మూలభూతం కావాలన్నారు. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) విషయాలను, ఆర్ట్స్ విషయాలతో సమ్మిళితం చేయడం ద్వారా రెండు అంశాల్లోనూ విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంచేందుకు వీలవుతుందంటూ పలు  పరిశోధనల్లో వెల్లడైన అంశాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

21వ శతాబ్దంలో భారతదేశ అవసరాలకు అనుగుణంగా  విద్యారంగంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకోవాలని ఆయన అభిలషించారు.
 
మానవీయ శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకు కూడా సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని అందించే దిశగా చొరవతీసుకోవాలని, తద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయంలోని ‘మోటూరి సత్యనారాయణ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీ ఇన్ హ్యుమానిటీస్’ కేంద్రాన్ని చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో సంపూర్ణ విద్యావిధానాన్ని (అన్ని విషయాలను విద్యార్థులకు బోధించే) అనుసరించే సంప్రదాయం ఉందని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) కూడా ఈ దిశగా భారతదేశ ప్రస్తుత విద్యావిధానంలో సానుకూల మార్పులు తీసుకురానుందని తెలిపారు.
 
ఇటీవల ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులతో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఐఐటీ – బాంబే ప్రారంభించడాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. మరిన్ని విద్యాసంస్థలు కూడా ఇలాంటి చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు కూడా ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో తమ  పిల్లలను చేర్పించడం ద్వారా వారి సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాల నుంచే ఇలాంటి విధానాలను అనుసరించడంపైనా విద్యాశాఖ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
 
మోటూరి సత్యనారాయణ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేఆర్ఈఏ విశ్వవిద్యాలయం నిర్వాహకులను,  మోటూరి సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి అభినందించారు. సామాజిక విజ్ఞానంలో పరిశోధలకోసం ఇలాంటి కేంద్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు విధాన నిర్ణేతలతో కలిసి సమాజంలో మార్పుకోసం మరింత సమన్వయంతో కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ముఖ్యంగా ఉన్నత కుటుంబాలు విద్య, వైద్యం, విజ్ఞాన రంగాల అభివృద్ధి కోసం ముందుకు రావాలని, ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించిన ఆయన, నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, సమాజ అభివృద్ధి కోసం నలుగురితో పంచుకోవాలి (లెర్న్... ఎర్న్... రిటర్న్ టూ సొసైటీ) అనే నినాదాన్ని ఇచ్చారు.
 
స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్ అయిన మోటూరి సత్యనారాయణకి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ మోటూరి లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రజాప్రతినిధులు చట్టసభల్లో యువతకు స్ఫూర్తిని అందించేలా వ్యవహారశైలిని కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు సైతం ఉత్తమ వ్యవహార శైలి కలిగి ఉన్న నాయకులను ఎంచుకోవాలన్న ఆయన... క్యారక్టర్ (గుణం), కెపాసిటీ(సామర్థ్యం), క్యాలిబర్(యోగ్యత), కాండక్ట్(నడత) ఆధారంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

కొంత మంది క్యాష్ (డబ్బు), కమ్యూనిటి (వర్గం), క్యాస్ట్ (కులం), క్రిమినాలిటి (నేరచరిత్ర) ఆధారంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
 
భారతీయ భాషలను ప్రోత్సహించడంలో మోటూరి కృషిని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి, మాతృభాషలో విద్యావిధానంతో ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. తాను ఏ భాషకూ వ్యతిరేకం కాదని, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడం ముఖ్యమన్న ఆయన, అంతకంటే ముందు మాతృభాషను, సోదర భాషను, జాతీయ భాషను నేర్చుకోవాలని సూచించారు.

భాషకు సంబంధించి వివాదాలు సృష్టించిడం మంచిది కాదన్న ఆయన... భాషలను బలవంతంగా రుద్దడం లేదా వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. మనం ప్రజలతో ఏ విషయాన్నైనా పంచుకోవాలంటే, వారి భాష ద్వారానే పంచుకోవలసి ఉంటుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. మహేశ్ రంగరాజన్, మోటూరి సత్యనారాయణ గారి అల్లుడు ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కపిల్ విశ్వనాథన్, ప్రొఫెసర్ ముకుంద్ పద్మనాభన్ సహా మోటూరి సత్యనారాయణ గారి ఇతర కుటుంబ సభ్యులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు