దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావంతో జాతీయ పార్టీలు ఉనికిని కొనసాగించడం కాస్త కష్టంగా ఉంది. అయినా సరే కేంద్రంలో జాతీయ పార్టీ హవా ఉంటుంది కాబట్టి అవకాశాలను ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని రాజకీయ క్రీడలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోనుంది.. ఎవరితో తెగతెంపులు చేసుకుంటున్నారు అన్న దానిపై ఎన్నికల ముందు ఆశక్తి కొనసాగుతుంటోంది.
తాజాగా మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మైత్రికి బ్రేక్ పడింది. మరో వైపు సీపీఐ, సీపీఎం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఏపీలో కూడా బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ హోదా ఇస్తామంటే బీజేపీకి మద్దతు ఇస్తామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఆసక్తిగా మారాయి. దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
ఒకవైపు టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నా కూడా సవతుల్లా కొట్టుకుంటున్నాయన్న అపవాదును మూటగట్టుకున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అవసరమైతే కోర్టుకు వెళతానంటూ చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటనతో ఈ రెండు పార్టీల మధ్య వివాదం మరింత తారా స్థాయికి చేరింది. బాబు కోర్టుకు వెళితే మేము కోర్టుకు వెళతామని సోము వీర్రాజు కౌంటర్ వేశారు. దీంతో ఏపీ బీజేపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డితో కలిసి ముందుకు సాగే దిశగా చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే హోదా విషయాన్ని మరోసారి వైకాపా తెరపైకి తెచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసి ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. హోదా అడిగిన తర్వాత చూద్దామంటూ నీతి ఆయోగ్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తెరలేపుతోంది. అయితే అసలు టీడీపీ హోదా విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారా లేదా అన్న విషయం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
నీతి ఆయోగ్ ఛైర్మన్ ద్వారా మోడీ ఏపీపై హోదా అస్త్రం వదిలారా. జగన్‌తో మైత్రికోసమే మోడీ దారి వేశారా. ఒకవేళ హోదాకు బీజేపీ సానుకూలంగా స్పందిస్తే టీడీపీ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీ, జగన్‌ల మధ్య ఏదో ఒకరకమైన ఒప్పందం నడుస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.