భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో మరో విజయవంతమైన ప్రయోగాన్ని నమోదు చేసుకుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇమిశాట్ సహా 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తోంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు.
విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ(ఇమిశాట్)ను పీఎస్‌ఎల్‌వీ సీ45 కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.