తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసురాలిని నేనే అంటూ ఆయన మేనకోడలు తెరపైకి వచ్చారు. అనారోగ్యం కారణంగా గత నెల 22వ తేదీ నుంచి జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. దీంతో తమిళనాడులో పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి.
ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిపాలన అచేతనంగా మారడంతో... అపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమించే పరిస్థితి కూడా ఏర్పడింది. మరోవైపు, ఎవరూ ఊహించని విధంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. అదే వారసత్వ పోరు. జయలలితకు తానే అసలు సిసలైన వారసురాలినంటూ ఆమె అన్న కూతురు దీప ఇప్పుడు న్యూస్ హెడ్ లైన్స్ లో నిలిచింది.
ఈ పరిస్థితుల్లో జయలలితకు స్వయానా అన్న అయిన జయకుమార్... విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని తన సోదరితో పాటు పోయస్ గార్డెన్‌లోనే ఉండేవారు. దీప కూడా అక్కడే పుట్టింది. ఆ తర్వాత కాలంలో జయకు, జయకుమార్‌కు మనస్పర్థలు వచ్చాయి. దీంతో, ఆయన పోయస్ గార్డెన్‌ను వదిలి టీనగర్లో సెటిల్ అయ్యారు. తదనంతర కాలంలో, 1995లో జయకుమార్ చనిపోయారు.
అప్పుడు జయలలిత ఆయన ఇంటికి వెళ్లి అందరినీ పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత 2013లో వదిన విజయలక్ష్మి చనిపోయినప్పుడు జయ వెళ్లలేదు. ఇటీవలే జయకుమార్ కుమార్తె దీప వివాహం జరిగింది. ఈ వివాహానికి కూడా జయ హాజరుకాలేదు. కానీ, కొత్త వధూవరులే జయ దగ్గరకు వచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. అత్తగా దీపకు ఓ ఫ్లాట్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు జయ.
తర్వాత కాలంలో భర్తతో దీపకు విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటోంది. తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో మేనత్తకు దగ్గర కావడానికి దీప ప్రయత్నించింది. జయను కలవడానికి పోయస్ గార్డెన్ వద్ద గంట సేపు వేచి ఉన్నా... లోపలకు వెళ్లడానికి దీపకు అనుమతి లభించలేదు. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీతో దీప గొడవ కూడా పడింది.
"ఈ ఇల్లును మా నానమ్మ (జయ తల్లి) నాకు రాసిచ్చింది. ఇది నా ఇల్లు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మా ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి మీరు ఎవరు?", అంటూ సెక్యూరిటీతో దీప వాదించింది కూడా. మా కుటుంబసభ్యులు మా అత్తకు దగ్గర కాకుండా పోయస్ గార్డెన్లో ఉంటున్న కొంతమంది అడ్డుపడుతున్నారంటూ కూడా దీప ఆరోపించింది.