కుమార స్వామి ఇంట్లో కుంపటి : 12 మంది ఎమ్మెల్యేలు జంప్?

సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి పార్టీలో కుంపటి చెలరేగింది. ఆ పార్టీకి చెందిన ఓ డజను మంది ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, జేడీఎస్ పార్టీలో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం ఆధిపత్యం పెరిగిపోవడాన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతారు. దీనికి నిరసనగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. 
 
తమ పట్ల అధిష్టానం ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్త ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాసన్ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.కే. కుమార స్వామి కూడా బీజేపీ వైపు చూస్తున్నారని పుకార్లు గుప్పుమంటున్నాయి. '12 మంది మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి జంప్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే నాటికి ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది' అని ఓ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. 
 
జేడీఎస్‌లో అధికారం ఏకీకృతం కావడం, దేవెగౌడ కుటుంబీకుల ఆధిపత్యం పెరిగిపోవడం, ఏకపక్ష నిర్ణయాలతో ఎమ్మెల్యేలు విసిగిపోయారని, అందుకే పార్టీని వీడడానికి సిద్ధమైపోయారని జేడీఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'జేడీఎస్ పునాదులు కదులుతున్నాయ్. భవిష్యత్ ఆందోళనకరంగా ఉంది. దేవెగౌడ కుమారులు పార్టీని సమర్థవంతంగా నడిపించలేరన్న అభిప్రాయం పార్టీలో స్థిరపడిపోయింది' అని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు