కర్నాటక సీఎం రేస్ : సిద్ధూను ఎంపిక చేయలేదు.. : రణ్‌దీప్ సుర్జేవాలా

బుధవారం, 17 మే 2023 (16:21 IST)
కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తదుపరి సీఎంగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న సయమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని పార్టీ శ్రేణులను కోరారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటిస్తుందన్నారు. మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్‌ కొలువుదీరుతుందని వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యనే ఎంచుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించినట్లు బుధవారం ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రేసులో సిద్ధూతో తీవ్రంగా పోటీపడుతున్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా పార్టీ ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లేదా.. సీఎం పదవీకాలాన్ని ఇద్దరికీ పంచేలా నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో డీకే సమావేశమయ్యారు. అయితే, హైకమాండ్‌ ప్రతిపాదనలకు శివకుమార్‌ అంగీకరించలేదని సమాచారం. రేసులో తాను వెనక్కి తగ్గబోనని డీకే.. రాహుల్‌కు స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాహుల్‌తో భేటీ అనంతరం శివకుమార్‌ నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. 
 
మరోవైపు, సీఎంగా సిద్ధు ఎంపిక దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు. బెంగళూరులోని సిద్ధూ నివాసం వద్ద కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆయన పోస్టర్‌కు పాలాభిషేకం చేశారు. అటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి కంఠీరవ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు