సీఎం పదవికి రాజీనామా చేస్తా కానీ, నా కుమారులకు పవర్ ఇవ్వాలి : యడ్యూరప్ప

శనివారం, 17 జులై 2021 (17:14 IST)
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారా? అందుకే ఆయన హస్తిన చుట్టూ తిరుగుతున్నారా? తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీఎం యడియూరప్ప సమావేశం కావడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. 
 
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంగా రాజీనామాకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కరోనా సమయంలోనూ కొంతమంది మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు యడియూరప్పను టార్గెట్‌ చేయడం.. ప్రభుత్వంపై ఆయనపై అసమ్మతి ఎక్కువైంది. 
 
ఈ నేపథ్యంలో యడ్డీని సీఎం పదవి నుంచి తప్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీ గండం పట్టుకుందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 
 
సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తుండటంతో యడియూరప్ప రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యడియూరప్ప ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. 
 
శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశమైన యడియూరప్ప రాజీనామా గురించే చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై శనివారం కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు రాజీనామాపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం యడియూరప్ప ఖండించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన యడ్డీ.. క‌ర్ణాట‌క‌లో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చ‌ర్చించేందుకు మాత్రమే తాను ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ప్రధానితో భేటీలో కర్ణాటక అభివృద్దిపై చర్చించినట్లు తెలిపారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
 
ముఖ్యంగా, ప్రధానితో భేటీ సందర్భంగా ప్రధాని మోడీతో కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడామని యడియూరప్ప తెలిపారు. కానీ, 'మీరు సూచించిన విధంగా నడుచుకుంటాను. అందుకు నేను సిద్ధమే. బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడే నడుచుకుంటాను. ఒకవేళ మీరు రాజీనామా చేయమంటే చేసేస్తాను' అని యడియూరప్ప ప్రధాని మోడీతో స్పష్టం చేసినట్లు సమాచారం. 
 
అదేసమయంలో బీజేపీ అధిష్టానం ముందు యడియూరప్ప కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తన కుమారులిద్దరికీ జాతీయ రాజకీయాల్లో కీలకమైన పదవులు ఇచ్చి, కీలకమైన పాత్ర పోషించేలా పార్టీ సహకరిస్తే, తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగానే ఉన్నానని యడియూరప్ప తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 
 
అయితే యడియూరప్ప మాత్రం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనను పదవి నుంచి వైదొలగమని ఎవరూ కోరలేదని ప్రకటించారు. 'రాజీనామాకు సంబంధించిన వార్తలన్నీ వదంతులే. రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కర్నాటక ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. వచ్చే నెలలో కూడా మరోసారి ఢిల్లీకి వస్తా' అని యడియూరప్ప ప్రధానితో భేటీ తర్వాత వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు