15 మంది యువతులను వంచించిన నిత్య పెళ్లికొడుక్కి కటకటాలు

సోమవారం, 10 జులై 2023 (12:31 IST)
కర్నాటక రాష్ట్రంలో వివాహం చేసుకుంటానని నమ్మిస్తూ 15 మందికిపై మహిళలను వంచించిన ఘరానా మోసగాడు మహేశ్‌ (35) అనే వ్యక్తిని కువెంపు నగర పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని బనశంకరికి చెందిన నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు చరవాణులు, ఆభరణాలను జప్తు చేసుకున్నారు. 
 
తాను వైద్యుడినంటూ మైసూరుకు చెందిన హేమలత (30) అనే యువతిని షాదీ డాట్ కామ్‌లో నిందితుడు పరిచయం చేసుకున్నాడు. మైసూరు విజయనగరలో అద్దె ఇంటిని చూపించి, ఇది తన సొంత ఇల్లు అని నమ్మించాడు. జనవరి ఒకటో తేదీన విశాఖపట్నం వెళ్లి వివాహం చేసుకుని, మైసూరుకు వచ్చి కాపురం పెట్టారు. క్లినిక్‌ పెట్టేందుకు రూ.70 లక్షల నగదు అవసరమని హేమలతను కోరాడు. 
 
ఆమె అందుకు నిరాకరించడంతో హత్య చేస్తానని బెదిరించాడు. వీలు చూసుకుని బీరువాలో ఉన్న రూ.15 లక్షల విలువైన ఆభరణాలు దొంగిలించి పరారయ్యాడు. భర్త తిరిగి వస్తాడని అనుకున్న ఆమెను దివ్య అనే మహిళ కలుసుకుంది. అపుడు మహేశ్‌ గురించి హేమలతకు దివ్య అసలు విషయం చెప్పింది. అతనో వంచకుడని, తనను కూడా వివాహం చేసుకుని వంచించాడని చెప్పడంతో ఆమె కువెంపునగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. 
 
నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.అరుణ్‌ తెలిపారు. విచారణలో ఇతను 15 మందికి పైగా మహిళలను ఇదే తరహాలో మోసం చేశాడని, కొందరిని వివాహం చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం పూర్తయిన తర్వాత నగదు, నగలతో పరారయ్యాడని గుర్తించామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు