భరణం కోసం ఎదురు చూస్తూ భార్య ఖాళీగా కూర్చోకూడదు : కర్నాటక హైకోర్టు
శుక్రవారం, 7 జులై 2023 (10:50 IST)
గతంలో ఉద్యోగం చేసిన భార్య, భరణం కోసం చూస్తూ ఖాళీగా కూర్చోకూడదని, తన భర్త నుంచే మొత్తం ఖర్చులు భరణంగా పొందాలని ఎదురు చూడొద్దని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పు నిచ్చింది. భర్త నుండి భరణం కోరుతూ బెంగళూరు అర్బన్ జిల్లా అనేకల్ పట్టణానికి చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర బదామికర్ తిరస్కరించారు. గతంలో ఉద్యోగం చేసిన భార్య జీవనోపాధి కోసం ఆ తర్వాత కూడా ఏదైనా చేసుకోవాలని, పూర్తి పోషణ కోసం భర్త నుండే భరణాన్ని పొందాలని చూడవద్దని, సహకారం కోరాలని పేర్కొన్నారు.
మహిళల రక్షణ చట్టం 2005లోని సెక్షన్ 12 ప్రకారం భరణం కోరుతూ సదరు మహిళ, ఆమె 11 ఏళ్ల కుమారుడు (ప్రస్తుతం) 2014లో మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం భార్యకు నెలకు రూ.10,000, మైనర్ కొడుకుకు నెలకు మరో రూ.5,000 చెల్లించాలని ప్రొవిజన్స్ స్టోర్ నడుపుతున్న భర్తను కోర్టు ఆదేశించింది.
అలాగే, భార్యను మానసిక వేదనకు గురిచేసినందుకు గాను ఆమెకు రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొంది. ఆ తర్వాత భర్త అప్పీల్ చేసుకోవడంతో నవంబర్ 7, 2015న, సెషన్స్ కోర్టు.. మహిళకు చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.5,000కి తగ్గించింది. కుమారుడికి రూ.5,000 భరణాన్ని యథాతథంగా ఉంచింది. పరిహారాన్ని రూ.3 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించింది. ఈ క్రమంలో భార్య తన కుమారుడితో కలిసి హైకోర్టును ఆశ్రయించింది.
తనకు ఇచ్చిన పరిహారం తక్కువగా ఉందని, సరైన కారణం లేకుండా సెషన్స్ కోర్టు భరణం, పరిహారం తగ్గించిందని ఆ మహిళ వాదనలు వినిపించారు. తమ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతోందని, ఈ కారణంగా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరారు. విచారణ సందర్భంగా జస్టిస్ రాజేంద్ర బాదామికర్ అన్ని అంశాలను పరిశీలించారు. అంతకుముందు భార్య ఉద్యోగం చేసేదని విచారణలో తేలింది. అత్త, తోడికోడలుతో ఉండటానికి ఆసక్తి చూపని ఆమె తన తల్లితో ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో ఆ భర్తకు తన తల్లి, సోదరిని చూసుకునే బాధ్యత ఉంటుందని జడ్జి పేర్కొన్నారు. అలాగే పెళ్లికి ముందు తాను ఉద్యోగం చేశానని, పెళ్లి తర్వాత మానేశానని పిటిషనర్ తెలిపింది. అయితే ఇప్పుడు ఉద్యోగం ఎందుకు చేయడం లేదో సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో భార్య తన జీవనోపాధి కోసం ఏదో పని చేయాలని, తన భర్త నుండి సహాయక పోషణను మాత్రమే ఆశించాలని, పూర్తిగా ఆధారపడకూడదని జస్టిస్ బాదామికర్ పేర్కొన్నారు.